Thursday 25 September 2014

నా మొదటి పది తూటాలు...4) తెలుగు ఎప్పటికి వెలుగు


తెలుగు ఎప్పటికి వెలుగు
ఇది 56 అక్షరాల భాష మాత్రమేనా? అన్న తలంపు నన్ను తట్టి లేపింది.
కాదు ఇది 56 లక్షల భావాలకు అతీతమైనదన్న సమాధానం నన్ను శాతింపజేసింది.

ఇది పరాయీ భాషకన్నా తక్కువా? అన్న సందేహం నన్ను కలిచివేసింది.
కాదు ప్రతీ భాష కన్నా ఇదే గొప్ప అన్న నివృత్తి నన్ను హాయీ నిద్రపుచ్చింది.

ఇది జవసత్వాలు నింపలేని సాధారణభాషా? అన్న ప్రశ్న నా కళ్ళలో నీళ్ళు నింపింది.
కాదు ఇది నవసమాజాన్ని నిర్మించిన అసాధారణ భాష అన్న జవాబు నా కళ్ళలో ఆనంద భాష్పాలు నింపింది.

ఇది షేక్స్పియర్ చదువని దురదృష్ట భాషా? అన్న భావన నన్ను కాస్త కలవరానికి గురి చేసింది.
కాదు ఇది శ్రీ శ్రీ అద్దిన మహోన్నత భాష అన్న నిజం నా గుండెలో సగర్వాన్ని నింపింది.

ఇది కార్పోరేట్ జీతం ఇవ్వలేని పనికిమాలిన భాషా? అన్న సంకోచం నాలో ఆక్రోశాన్ని నింపింది.
కాదు ఇది కుటుంబ విలువలు నేర్పే సుమధుర భాష అన్న ఎరుక నన్ను విజేతగా నిలిపింది.

ఎవడేమిటిరా ఇచ్చేది జాతీయ హోదా...?
మాతృభాష కాపాడుకోవడం మాకు రాదా...?
తరాలు మారిన, యుగాలు గడిచిన...
ఖరాఖండిగా మేం చెప్పెదోక్కటే...!
దేశ భాషలందు తెలుగు లెస్స...!!!

తెలుగు ఎప్పటికి వెలుగు

రచన:  01-01-2013                       
ప్రవీణ్ తాడూరి – PRA“WIN” TADURI
చైర్మన్ స్కూల్- బిబిసి హై- ఆక్స్ఫోర్డ్ ఇంగ్లీష్ ల్యాబ్ నిజామాబాద్
Chairman - School – BBC HIGH- OXFOD ENGLISH LAB- Nizamabad
94404 76854

నా మొదటి పది తూటాలు...3) ఓ మనిషి నీ లక్ష్యమేమిటి?


ఓ మనిషి నీ లక్ష్యమేమిటి?


ప్రవేశిస్తున్నావు మాతృగర్భంలోకి నీకు తెలియకుండా,
బయటపడుతున్నావు నవమాసాల తర్వాత ఉషోదయ భానుడిలా,
దాటుతున్నావ్ బాలారిష్టాలు కేరింతల మధ్య,
పెంచ బడుతున్నావ్ లౌకిక జ్ఞానమే ధ్యేయంగా,
చేసుకొంటున్నావ్ డబ్బు సంపాదనే జీవితపు లక్ష్యంగా,
జరుపుకొంటున్నావు పెళ్ళి సంభరాలు ఆర్భాటంగా,
పుట్టిస్తున్నావు పిల్లలను ఒక అవసరంగా,
పెంచుతున్నావు వారిని ని మనో వాంఛ కార్య వారసులుగా,
చేరుకుంటున్నావు అవసాన దశ సృష్టి ధర్మంగా,
పడుతున్నావు పడలేని అగచాట్లు మలిసంధ్యలో అతిధీనంగా,
ముగిస్తున్నావు నీ జీవన పయనాన్ని అర్థాంతరంగా, అసంతృప్తిగా,
ఇంత చేసినా ఒక ప్రశ్నకు జవాబు మాత్రం అలాగే నీతో దోబుచులాడుతూనేవుంది...ఓ మనిషి నీ లక్ష్యమేమిటి?

నా మొదటి పది తూటాలు... 2) ఓ మనిషి నీవెక్కడ ?


ఓ మనిషి నీవెక్కడ?

అడగాలని వుంది, నిగ్గతీయాలని వుంది,
అందుకే చెప్పేవారికోసం వెతుకుతున్నా!

చెప్పాలని వుంది, గుట్టు విప్పాలని వుంది,
అందుకే అడిగేవారికోసం వెతుకుతున్నా!

సంతోషపరచాలనివుంది, రంజింపజేయాలనివుంది,
అందుకే ఆనందించేవారికోసం వెతుకుతున్నా!

వినాలనివుంది, మైమరచిపోవాలనివుంది,
అందుకే పాడే వారికోసం వెతుకుతున్న!

చూడాలనివుంది, పరవశించిపోవాలనివుంది,
అందుకే నాట్యం చేసే వారి కోసం వెతుకుతున్న!

స్పందించాలని ఉంది, స్పర్శించాలని ఉంది,
అందుకే ప్రేమించబడేవారికోసం వెతుకుతున్న!


మానవీయ విలువలు, వలువలు వదిలి నడి వీధి లో నృత్యం చేస్తున్న వేళ,
అమేయ ప్రమేయమైన మేధోసంపత్తి గలవారు కుంచిత భావాలతో వ్యాఖ్యానిస్తున్న వేళ,
నిజం నగ్నమై, అబద్దం అమోఘమై, క్రూరత్వం కడుపునింపుకుంటున్న వేళ,
అశేష జనవాహిని వాహన ఎడారిలో
ఒక నిస్వార్థ ప్రేమాభిమానపూరితమైన మనిషి కోసం వెతుకుతున్నా!  ఓ మనిషి నీవెక్కడ?


రచన:  01-01-2013                       
ప్రవీణ్ తాడూరి – PRA“WIN” TADURI
చైర్మన్ స్కూల్- బిబిసి హై- ఆక్స్ఫోర్డ్ ఇంగ్లీష్ ల్యాబ్ నిజామాబాద్
Chairman - School – BBC HIGH- OXFOD ENGLISH LAB- Nizamabad
94404 76854

నా మొదటి పది తూటాలు...1) దేవతకు వందనం


దేవతకు వందనం          
ఆడది అంగడి సరుకా?
కొంత మగ జాతిని నరక!
ఎవడికేం ఎరుక
బిడ్డ కోసం ఆడది పడ్డ మరక?
ఆడదీ లేకుంటే
నీవెంత మగాడివో నీకేం ఎరుక?

ఆడది ఆట బొమ్మా?
కొంత మగ జాతిని తెగనమ్మ!
ఎవడికి లేదురా
ఇంటిలోపలబయట అక్క, చెల్లి, అమ్మా?
ఆడదేమైన నీకు-
దేవుడిచ్చిన శృంగారపు బొమ్మా?
నిన్ను తెగనమ్మ!!

ఆడది శయణేషు రంభా?
కొంత మగజాతిది రేగాలి పంబ!
కార్యేషుదాసీ, కరుణేషు మంత్రి, భోజ్యేషు మాత,
క్షమయా ధరిత్రి! రాదా గుర్తుకు  సావిత్రి?
మాత్రమే కావలా రంభ?
కొందరిది రేగాలి పంబ!
అందరిచే కావ్యలల్లిస్తూ, చిత్రాలు వేయిస్తూ, పాటలుపాడిస్తూ-
మమ్ముల్ని లాలిస్తూ, మురిపిస్తూ, గౌరవిస్తూ, సుఖపెడ్తూ-
నీవు చస్తూ, మా అందరికీ జన్మనిస్తున్న-
ప్రేమానురాగాత్మియతామూర్తి, శృంగారానికే ఘనకీర్తి స్త్రీ
నీకు, అందరి మగాళ్ళ తరపున ఇదే నా వందనం.
రచన:  01-01-2013                       
ప్రవీణ్ తాడూరి – PRA“WIN” TADURI
చైర్మన్ స్కూల్- బిబిసి హై- ఆక్స్ఫోర్డ్ ఇంగ్లీష్ ల్యాబ్ నిజామాబాద్
Chairman - School – BBC HIGH- OXFOD ENGLISH LAB- Nizamabad
94404 76854

నా మొదటి పది తూటాలు...5 ) మొదలు పెడతావా ఓ గంగుల?


మొదలు పెడతావా ఓ గంగుల?
కాలచక్రపుగమనచలనములో అలుపెరుగని ఓ బాటసారి,
మనసుతో తప్ప ఆధరాలతో  మాట్లాడని ఓ బిడియపు మాటకారి,
మందహాసవదనం తో తప్ప నైరాశ్యం తో కనపడని ఓ ఆచారి,
పదవీ విరమణ చేస్తున్నావా ?
పదవీ విరమణ చేస్తున్నావా ఓ గంగుల?

పాఠశాల పూదోటలో,
పుస్తకాల రెక్కలు విప్పి,
పాఠాల పరిమళాలను వెదజల్లి,
పదవీ విరమణ చేస్తున్నావా ?
పదవీ విరమణ చేస్తున్నావా ఓ గంగుల?

విద్యార్థుల మనో ఫలకం పై,
చెదరనిపాటలు వ్రాసి,
జీవితపు బాటలు వేసి,
విజయపు బావుటా ఎగురవేసి,
పదవీ విరమణ చేస్తున్నావా ?
పదవీ విరమణ చేస్తున్నావా ఓ గంగుల?

విధ్యావినీలాకాశపు ఓ ధృవతార,
ప్రేమాభిమానురాగల విలువలుగల ఓ నయగార,
రెక్కలు ముక్కలు చేసి,
డొక్కలు చెక్కలు చేసి
పిక్కల పక్కలు వేసి,
విలువల కోటలు, గౌరవ మేడలు కట్టిన ఓ చక్రవర్తి,
గెలుపే తెలిసిన, అలుపేఎరిగని,
మనసే తెలిసిన, కాఠిన్యం ఎరుగని,
స్నేహప్రేమలే తెలిసిన, అహమే ఎరుగని,
ఓ అజాతశత్రు,
జీవితపు అగచాట్ల నుండి,
సమాజపు నగుబాట్లనుండి,
కుటుంబాన్ని గుండెలకత్తుకొని,
రిక్త పాదాలతో కాలపుముళ్ళ పై  నడిచిన ఓ మౌనముని,
పదవీ విరమణ చేస్తున్నావా ?
పదవీ విరమణ చేస్తున్నావా ఓ గంగుల?


నామట్టుకునాకు, నీకిదికాదు పూర్ణబిందువు,
ప్రయాణం మొదలైంది, నడకప్రారంభించు ఓ బంధువు,
ఆశావాహ రధచాక్రాలపై,
నికేతేలిసిన విజయసూత్రాలపై,
గడిచిన దశాబ్దాల అనుభవ సప్తవర్ణాశ్వాలపై,
విశ్వాసపు ఖడ్గంబూని, ధీమా డాలుతో,

ప్రయాణం మొదలు పెడతావ మిత్రమా?
ప్రయాణం మొదలు పెడతావ ఓ గంగుల?
(ఈ కవిత నా మిత్రుడు గంగుల శశాంక్ యొక్క తండ్రి గారైన శ్రీ గంగుల సత్యనారాయణ గారు ప్రభుత్వ హెడ్ మాస్టర్ గా తన విధులనుండి రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత వారికి పదవి విరమణ సత్కారం రోజున నేను ఉదయము వారికి ఏమి బహుమతి ఇచ్చినచో సముచితముగా నుండును అని తలంచి చివరకు అక్షర బహుమతిని ఇవ్వదలచి ఈ కవితను వ్రాసి సత్కారమహోత్సవములో చదివి వారికి బహుమతి గా ఇచ్చినాను)


రచన:  31-10-2013
ప్రవీణ్ తాడూరి – PRA“WIN” TADURI
చైర్మన్ స్కూల్- బిబిసి హై- ఆక్స్ఫోర్డ్ ఇంగ్లీష్ ల్యాబ్ నిజామాబాద్
Chairman - School – BBC HIGH- OXFOD ENGLISH LAB- Nizamabad
94404 76854